నిరుద్యోగ యూవతకు ఇతను ఆదర్శం

ప్రభుత్వ ఉద్యోగం చాలామంది కుర్రకారు కల... సాకారం కావాలంటే తీవ్రంగా శ్రమించాల్సిందే... సరదాలు మానాలి.. గంటలకొద్దీ పుస్తకాలకే అతుక్కుపోవాలి...లక్షలమందితో పోటీ పడి నెగ్గాలి... ఒక్క కొలువే గగనమైన ఈ రోజుల్లో ఏకంగా ఆరింటిని అవలీలగా సాధించాడు ఆదిలాబాద్‌ జిల్లా కుర్రాడు రాపెల్లి రాజశేఖర్‌.

ఖానాపూర్‌కి చెందిన అమృత, ఎర్రన్నలు వ్యవసాయ కూలీలు. మా పిల్లలు మాలాగ కష్టపడొద్దని వాళ్ల తపన. చదువే అందుకు మార్గంగా కనపడింది. కన్నవాళ్ల కోరికను చిన్నప్పుడే అర్థం చేసుకున్నాడు రాజశేఖర్‌. క్షణం దొరికినా పుస్తకం వదిలేవాడు కాదు. ఆ కష్టం ఫలితాన్నిచ్చింది. పదోతరగతిలో పాఠశాలలో ప్రథముడిగా నిలవడంతో రాజశేఖర్‌లో ఏదైనా సాధించొచ్చనే ఆత్మవిశ్వాసం పెరిగింది. ఓ ప్రైవేటు కళాశాల ఉచిత భోజన, వసతి కల్పించడంతో పట్టుదలగా చదివి నిర్మల్‌ పట్టణ టాపర్‌గా నిలిచాడు. 84 శాతం మార్కులతో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. అదే జోరుతో ‘గేట్‌’ రాస్తే జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు వశమైంది.
డిగ్రీ పట్టా చేతికందగానే కొలువుల వేట ప్రారంభించాడు రాజశేఖర్‌. 2010లో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో మొదటి ఉద్యోగం కొట్టి ఖాతా తెరిచాడు. ఓవైపు విధులు నిర్వర్తిస్తూనే మంచి హోదా ఉండే ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవాడు. అలా నాలుగేళ్లలో ఇంకో ఐదు ఉద్యోగాలు సొంతం చేసుకున్నాడు. వీటిలో ఇంజినీరింగ్‌ అభ్యర్థులు కలలు కనే ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీస్‌ (ఐఈఎస్‌) కూడా ఉంది. 2013లో మొదటిసారి ఐఈఎస్‌ రాస్తే సఫలం కాలేదు. అదే అతడి జీవితంలో తొలి అపజయం. సవాలుగా తీసుకొని దిల్లీకెళ్లి కొన్నాళ్లు శిక్షణ తీసుకొని కసిగా చదివాడు. ప్రతిష్ఠాత్మక కొలువు పాదాక్రాంతమైంది. దీంతోనే సరిపెట్టుకోకుండా సివిల్స్‌ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు రాజశేఖర్‌. ఇంటర్‌లో ఉండగా ‘యూ ఆర్‌ ది క్రియేటర్‌ ఆఫ్‌ యువర్‌ ఓన్‌ డెస్టినీ’ అనే అంగ్ల సామెత అతడినెంతో ఆకట్టుకొంది. దాన్నే అమలుపరుస్తూ నచ్చినట్టుగా తలరాత రాసుకుంటున్నాడు ఈ పాతికేళ్ల కుర్రాడు.
ఐదేళ్లలో ఆరు ఉద్యోగాలు
* 2010లో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో మెటీరియల్స్‌ ఆఫీసర్‌ ఉద్యోగం
* 2013లో ఓఎన్‌జీసీ ఏఈఈగా ఎంపికయ్యాడు
* 2015లో వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీగా కొలువు
* 2016లో తెలంగాణ జెన్‌కోలో ఏఈగా విజయం
* కేంద్ర ప్రభుత్వ పేటెంట్‌ ఆఫీసర్‌గా నియామకం
* తాజాగా యూపీఎస్సీ నిర్వహించిన దశలవారీ పరీక్ష ద్వారా ఐఈఎస్‌కి ఎంపిక.
సేకరణ:-రాజ్ మహమ్మద్,డేబైడైన్యూస్99

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తేడాలు: పట్టణ - పల్లె వాసులకు

వినాయకుని తొండం ఎటు వైపునకు ఉంటే మంచిది?

మనిషి విలువ