రైతు లకు శుభవార్త



వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు లేక అవస్థలు పడుతున్న రైతులకు శుభవార్త. దరఖాస్తు చేసుకున్న అన్నదాతలందరికీ రాబోయే ఏడు నెలల్లో కనెక్షన్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన ఆదేశాలతో అధికార యంత్రాంగం కదిలింది. కార్యాచరణను ప్రారంభించడంతో కొన్నేళ్లుగా విద్యుత్తు కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్న రైతుల్లో ఆశ చిగురించింది. గ్రామాల వారీగా దరఖాస్తు చేసుకున్న రైతులను గుర్తించడంతో పాటు కనెక్షన్‌ మంజూరుకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయనే దానిపై అధికారులు పరిశీలన చేస్తున్నారు. అలాగే ఆయా విద్యుత్తు కనెక్షన్లకు ఏయే సామగ్రి అవసరం, ఎంత మొత్తం ఖర్చు అవుతుందనే దానిపై సర్వే నిర్వహిస్తున్నారు. వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నాలపై ‘న్యూస్‌టుడే’ కథనం.

ఉమ్మడి జిల్లాగా ఉన్న ఆదిలాబాద్‌లోనే నాలుగు జిల్లాలకు చెందిన సర్కిల్‌ కార్యాలయం ఉంది. వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్ల సర్వే పూర్తి చేసి అంచనా వ్యయంతో ప్రతిపాదనలు పంపించాలని సర్కిల్‌ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈమేరకు మండలాల వారీగా రిజిస్టరు చేసుకున్న రైతులతో పాటు వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు డీడీలు చెల్లించిన రైతుల వారీగా వివరాలను సేకరించి అర్హులను గుర్తిస్తున్నారు. గతంలో రిజిస్టరు చేసుకున్న రైతుల వారీగా కనెక్షన్లు మంజూరు చేసేవారు. సీనియారిటీ ఉంటుందనే కారణంతో కొంత మంది రైతులు పంట పొలంలో నీటి వసతి లేకున్నా కనెక్షన్‌ కోసం రిజిస్టరు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు మంజూరు చేయాలని ఆదేశించడంతో సాగునీటి వసతి (బోరు, బావి) ఉన్నది లేనిది చూడటంతో పాటు విద్యుత్తు కనెక్షన్‌ ఇచ్చేందుకు స్తంభాలు, విద్యుత్తు తీగ, నియంత్రికలు తదితర అవసరాలను గుర్తించి ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ప్రభుత్వం వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్తు ఇస్తుండటంతో నాలుగైదేళ్లలో విద్యుత్తు కనెక్షన్ల సంఖ్య భారీగా పెరిగింది. ఉమ్మడి జిల్లాలో 80 వేలు ఉన్న వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ప్రస్తుతం 1,03,968లకు చేరుకున్నాయి. ఉచితంగా విద్యుత్తు.. అదీ తొమ్మిది గంటలు చేయడంతో అనేక మంది రైతులు బోర్లు, బావులు తవ్వుకొని కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఏటా కొన్ని మాత్రమే కనెక్షన్లు మంజూరు చేస్తుండటంతో దరఖాస్తు చేసుకున్న వారి సీనియారిటీ ప్రకారంగా ఇస్తున్నారు. కొంతమంది అధికారులు మామూళ్లకు అలవాటు పడి సీనియారిటీకి సంబంధం లేకుండా కనెక్షన్లు మంజూరు చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఈనేపథ్యంలో సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు, రైతుల అవసరాలను గుర్తించి పెండింగులో ఉన్న దరఖాస్తులతో పాటు భవిష్యత్తులో వచ్చే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుని కనెక్షన్లు మంజూరు చేయాలని ఆదేశించారు.

* కదిలిన యంత్రాంగం

ముఖ్యమంత్రి ఆదేశాలతో వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్ల అర్హులను గుర్తించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. పెండింగులో ఉన్న దరఖాస్తుదారుల వివరాలను అంతర్జాలంలో పొందుపరుస్తున్నారు. మండలాల వారీగా అర్హుల జాబితాను తెప్పిస్తున్నారు. రైతుల వారీగా నీటి సౌకర్యం ఉన్నది లేనిది పరిశీలించడంతో పాటు అవసరమయ్యే సామగ్రి, అంచనా వ్యయం తదితర వివరాలతో ప్రతిపాదనలను తీసుకుంటున్నారు. రైతులు హెచ్‌పీకి రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. ఐదు హెచ్‌పీ మోటారుంటే రూ.6 వేలు చెల్లించాలి. మిగిలిన వ్యయం ప్రభుత్వం భరిస్తుంది. గతంలో రూ.50 వేల వరకు విద్యుత్తు శాఖ భరించేది. ఇప్పుడు రూ.70 వేలకు పెంచారు. కనెక్షన్ల వారీగా అంచనా వ్యయం రూపొందిస్తే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు ఎంత ఖర్చు అవుతుందనేది తెలుస్తోంది.

* రైతుల్లో ఆశలు

ఎన్నో ఏళ్లుగా పెండింగులో ఉన్న వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు మంజూరు అవుతుండటంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఉమ్మడి జిల్లా మొత్తంలో 10,700 మంది రైతులు దరఖాస్తులు చేసుకోగా హెచ్‌పీల వారీగా డబ్బులు చెల్లించిన రైతులు 4,517 మంది ఉన్నారు. మిగిలిన రైతులు రూ.25 మాత్రం చెల్లించి సీనియారిటీ జాబితాలో ఉన్నారు. ఇందులో బోర్లు, బావులు లేకున్నా దరఖాస్తు చేసుకున్న రైతులుండటంతో వారిని జాబితాలో నుంచి తొలగిస్తున్నారు.

* వచ్చే నెలలోగా ప్రతిపాదనలు సిద్దం
- జైవంత్‌రావు చౌహన్‌, విద్యుత్తు శాఖ ఎస్‌ఈ

వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేశాం. వచ్చే నెలలోగా రైతుల వారీగా అంచనా వ్యయంతో కూడిన ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపిస్తాం. కొత్త కనెక్షన్ల మంజూరుకు అవసరమైన సామగ్రి తదితరాలను తెప్పిస్తున్నాం. ప్రభుత్వం ఏడు నెలల్లో రైతులందరికీ కనెక్షన్లు ఇవ్వాలంటోంది. అంతకన్నా ముందే ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించాం. ఇప్పటికే గ్రామాలవారీగా సర్వే జరుగుతోంది. మండలాలవారీగా అర్హుల జాబితాలు రూపొందిస్తున్నారు. ఉమ్మడి జిల్లా మొత్తంలో 10 వేల దరఖాస్తుదారులు ఉన్నారు. ఇప్పటికే ఇందులో కొంత మంది రైతులకు కనెక్షన్లు ఇచ్చేశాం. ఆరు వేలకు మించి అర్హులు ఉండకపోవచ్చు. మరో వారం రోజుల్లో అర్హుల సంఖ్య స్పష్టం అవుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తేడాలు: పట్టణ - పల్లె వాసులకు

వినాయకుని తొండం ఎటు వైపునకు ఉంటే మంచిది?

మనిషి విలువ